బ్యాంకుల విలీనంపై ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సును ప్రారంభించిన మోదీ అనంతరం ప్రసంగించారు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ర్యాంక్ మెరుగుపడిందన్నారు. తమ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న విధానం వల్లే తిరిగి అధికారంలోకి వచ్చిందన్నారు. విదేశాల్లో హింసను ఎదుర్కొంటున్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తే వారికి మంచి భవిష్యత్తు అందించిన వారమవుతామని చెప్పారు.
370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారని చెప్పారు. వారి జీవితాల్లో కొత్త ఆశలు ఊపిరి పోసుకుంటున్నాయన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుచేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామన్నారు. అయోధ్య తీర్పు తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగుతాయంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ ప్రజలు సంయమనం పాటించి అవన్నీ తప్పని నిరూపించారన్నారు.