telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రోగ్రెస్ చెప్పి … పెట్టుబడులు ఆహ్వానిస్తున్న మోడీ..

modi attracting investments from

భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మక అడుగు అని అన్నారు. దేశ ప్రగతికి ఆటంకాలు కలిగించే 50 చట్టాలకు స్వస్తి పలికామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన న్యూయార్క్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ…భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామిక వర్గాలకు విఙ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు భారత్‌ అనుకూల దేశమని.. భారత్‌తో వాణిజ్య, వ్యాపారాల్లో భాగస్వామ్యం కావడం సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ‘ మీ కలలు, ఆశయాలకు భారత్‌ గమ్యస్థానం. మీ సాంకేతికతకు మా ప్రతిభను జోడిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చు. మీ మెళకువలు- మా నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయి. వీటన్నింటికీ నేను వారధిగా ఉంటాను’ అని మోదీ పిలుపునిచ్చారు.

గత ఐదేళ్లలో ఎన్నెన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ‘ మా ప్రజాస్వామ్య విలువలు, న్యాయ వ్యవస్థ మీ పెట్టుబడులకు భద్రతనిస్తాయి. ఇంజనీరింగ్‌, పరిశోధన- అభివృద్ధిలో భారత ప్రజలు అత్యంత ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అన్ని రంగాల్లోనూ పారదర్శక విధానాలు అవలంబిస్తాం. భారత్‌లో పెట్టుబడులకు ఇదే అనుకూల సమయం అని మోదీ పేర్కొన్నారు.

Related posts