telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఎన్నడూ లేని భారీవర్షాలతో .. వణికిపోతున్న రాష్ట్రాలు…

huge rain in 17 states in india

భారీ వర్షాలతో దేశంలో పలురాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. సగానిపైగా రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. దేశంలోని 17 రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం కుంభవృష్టి కురుస్తుందని అధికారులు తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆల్ ఇండియా వార్నింగ్ బులెటిన్ లో అధికారులు వివరించారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముంది. అరేబియా సముద్రంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బీహార్‌లో గంగానది ఉప్పొంగుతోంది. గంగానది నుంచి వరదనీరు పోటెత్తడంతో లఖిసరాయ్‌ జిల్లా పరిధిలోని 6 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కకున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరుకోవడంతో భారీ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరద ముంపు క్రమంలో గ్రామాల్లో వ్యాధులు విజృంభించే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఏక ధాటిగా పడుతున్న వర్షాలతో దేశం మొత్తం వణికిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

Related posts