telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఒప్పందం మేరకే ఆ బియ్యం కొంటాం..-పీయూష్‌

వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుంద‌ని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు. శుక్రవారం నాడు రాజ్య‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సమయంలో వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ సమాధానం ఇచ్చారు.

తాము ఉప్పుడు బియ్యాన్ని ఇవ్వమని ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్​సీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామని పునరుద్ఘాటించారు.

ముడి బియ్యాన్ని ఎంతైనా కొనుగోలు చేస్తామన్న కేంద్ర మంత్రి..లేదంటే మీ రాష్ట్రంలోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని కేంద్ర మంత్రి గోయల్ తెగేసి చెప్పారు. ఇతర రాష్ట్రాలు తినగలిగే బియ్యం ఉంటేనే సెంట్రల్ పూల్ కు మిగులు బియ్యం తీసుకొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు

ఇప్పుడు కొత్తగా వరి ధాన్యం సేకరణ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. పంజాబ్‌ తరహలోనే తమ రాష్ట్రం నుండి కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పంజాబ్ లో పండే ధాన్యాన్ని దేశం మొత్తం తింటారన్నారు. అదే తరహలోని ధాన్యాన్ని ఇస్తే తాము తీసుకొంటామని తెలంగాణ సర్కార్ కు చెప్పినట్టుగా పీయూష్ గోయల్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తుందని పీయూష్ గోయల్ విమర్శించారు.

గతంలో ఎఫ్‌సీఐ అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంది. పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చాక నిర్దేశించుకున్న ధర మేరకు కొనుగోలు చేసి… రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వాటిని ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. పంజాబ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో.. అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది. రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఇప్పటికే మాతో విస్తృతంగా చర్చలు జరిపారు.

కొందరు ముఖ్యమంత్రులు అయితే బెదిరింపులకు సైతం దిగారు. అయినా మేము ఇప్పటికీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం. ఉప్పుడు బియ్యాన్ని ఒప్పందం మేరకు కొనుగోలు చేస్తాం. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నామ‌ని అన్నారు.

Related posts