లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796/12797) రైలు వేగం మరింత పెరగనుంది. ఉదయం 4:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరే ఈ రైలు 5:30 గంటలకు సికింద్రాబాద్, ఉదయం 10:45 గంటలకు విజయవాడ చేరుకుంటోంది. అయితే, ఇకపై పావుగంట ముందుగానే అంటే 10:30 గంటలకే విజయవాడ చేరుకోనుంది. అయితే, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటోంది. అయితే, ఇకపై 20 నిమిషాలు ముందుగా అంటే 11:15 గంటలకే లింగంపల్లి చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
కొత్త టైంటేబుల్ అమలైతే సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే తొలి వేగవంతమైన రైలుగా ఇది రికార్డులకెక్కుతుంది. సికింద్రాబాద్ నుంచి ఐదు గంటల్లోనే విజయవాడకు.. తిరుగు ప్రయాణంలో 4:50 గంటల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. కొత్త వేళల ప్రకారం.. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:20 గంటలకు బదులుగా 5:25కు బయలుదేరి గుంటూరుకు 20 నిమిషాల ముందుగా అంటే 9:20 గంటలకు చేరుకుంటుంది. మంగళగిరికి 9:42కి, విజయవాడకు 10:30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ, మంగళగిరి, గుంటూరు స్టేషన్లకు చేరుకునే సమయాల్లో మార్పులు లేవు.