telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎంకు తిడుతూ రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు..?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని నానా తిట్లు తిడుతూ.. రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని ఏపీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన అనంతరం ఉద్యోగుల సమ్మెపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనలు.. ఆందోళనలో వారు మాట్లాడిన తీరును పేర్నినాని త‌ప్పుబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడితే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా?అని ప్రశ్నించారు. ఏదైనా న్యాయంగా పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని పేర్కొన్నారు.

చంద్రబాబు మాటలు వినడం.. గాడిద ఎక్కడం ఒకటేనన్నారు. ఉపాద్యాయులను ఎన్నిరకాలుగా చంద్రబాబు ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని పేర్ని ప్రశ్నించారు. ఉద్యోగులు చంద్రబాబు ముసలికన్నీరు చూసి మోసపోవద్దని పేర్ని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ అంశం ప్రభుత్వం దృష్టికి రాలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఉద్యోగులతో మాట్లాడేందుకు సీఎస్, ప్రభుత్వ సలహాదారు, ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తానూ మీడియాలోనే చూశానని చెప్పారు. సంప్రదింపులు చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts