అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ ఏడాది ఆగష్టు 23కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
హైకోర్టు తీర్పు తర్వాత ప్రారంభించిన, చేపట్టిన పనుల గురించి ఏపీ ప్రభుత్వం ఓ స్టేటస్ రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. అయితే అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని తాము కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశామని ధర్మాసనం దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతుల తరపు న్యాయవాది ఉజ్జం మురళీధర్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు.
ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. అయితే ఆ ఫైల్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
రాజధాని పిటీషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌ల నేతృత్వంలో రాజధాని పిటిషన్లపై విచారణ జరిగింది.
అయితే ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టు పరిశీలించిన తర్వాతే మీ వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం రైతుల తరపు న్యాయవాది మురళీధర్ కు స్పష్టం చేసింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ ఏడాది ఆగష్టు 23వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు