telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ పోయింది..త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే..

టీడీపీ నేత‌లు రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిపోయారు అని జోగీ ర‌మేష్ ఎద్దేవ చేశారు. చంద్ర‌బాబు ఆదేశాల‌తోనే స‌భ‌ను అడ్డుకుంటున్నార‌ని త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయేది టీడీపీ శవ‌యాత్రే అని జోగీ ర‌మేష్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

జాబ్ క్యాలెండర్ పైన‌ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభలో చర్చకు పట్టుబట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళకు దిగారు.

టీడీపీ ఆందోళనల మధ్యనే.. స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. టీడీపీ నేతలు ‘జాబు ఎక్కడ జగన్?’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి చర్చ జరపాలని నినాదాలు చేశారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, అధికార వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు రాజకీయ నిరుద్యోగులు మారారని మండిపడ్డారు. సభలో చాలా విషయాలపై చర్చ జరగాల్సి ఉందని.. చర్చించే దమ్ము లేదు కాబట్టే గొడవ చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ సభ్యులు చర్చకు రాకుండా.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి గొడవ చేస్తూ చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పోయిందని.. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రేనని విమర్శించారు.

Related posts