ప్రతిపక్షంలో ఉండీ టీడీపీ నేతలు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం తగదని ఇలాంటి వార్తలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. చంద్రబాబు గురించి గొప్పగా రాసుకుంటే ఎల్లో మీడియా రాసుకోమని అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్న దుష్ప్రచారంతో పాటు పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్ల కాంట్రాక్టు పనులు పోయాయని టీడీపీ నేతలు బాధపడుతూ ఇలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. నాలుగున్నరేళ్ల తర్వాత టీడీపీ ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియదన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మైండ్ బ్లాకైందన్నారు.