ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకానమీ ఫోరం సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. మొఘల్స్, బ్రిటిషర్లు రాకముందు ప్రపంచంలోనే భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. యోగి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఏ విషయం మీద కూడా తనకు కనీస పరిజ్ఞానం లేదని యోగి మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థపై యోగి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనా రాహిత్యం అన్నారు. యోగికి తెలియకపోతే నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. తాను ఒకే ప్రశ్న అడగదలచుకున్నానని, గత ఆరేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగిత, కరువు, మాటేమిటి? 5 శాతం జీడీపీ సంగతేమిటి? అంటూ ఒవైసీ నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేదని ఒవైసీ విమర్శించారు.