మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీకి) పరాభవం ఎదురవడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతానని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను టీఎంసీ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమత శనివారం కోల్‌కతాలో తొలిసారి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ బెంగాల్‌లో ప్రజలను మతం పేరుతో చీల్చుతున్నదని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి నిష్క్రమిస్తానని టీఎంసీ అంతర్గత సమావేశంలో నేను ప్రతిపాదించా. కానీ నా ప్రతిపాదనను మా పార్టీ తిరస్కరించింది. కనుక నేను పదవిలో కొనసాగవచ్చు అని ఆమె చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంపై మమత అనుమానాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ సాధించిన భారీ విజయం అనుమానానికి అతీతమైనదేమీ కాదు.
ప్రతిపక్షం పలు రాష్ర్టాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అక్కడ ఏదో జరిగింది. ఇందులో విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉన్నది అని మమత వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ బెంగాల్‌లో అత్యవసర స్థితి (ఎమర్జెన్సీ) లాంటి పరిస్థితిని సృష్టించిందని ఆమె ఆరోపించారు. మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్న బెంగాల్‌లో ఈసారి బీజేపీ 18 స్థానాలను కైవసం చేసుకోవడంతో టీఎంసీ 22 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత టీఎంసీ అభ్యర్థులందరితోపాటు పార్టీ సీనియర్ నేతలతో శనివారం సమావేశమయ్యారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఆ పదవి నుంచి వైదొలగాలని భావించానని, కానీ తన ప్రతిపాదనను పార్టీ తిరస్కరించిందని ఆమె విలేకర్లకు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తన ప్రభుత్వం నెరవేర్చిందని, ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు.