మదిలో
నిరంతర కాల ఝరిలో
నీ వనజ వదనంలో
నవ్వునై పులకిస్తున్నా
కడలి తరగవై
కన్నెగులాబీవై
అనంత సుందర
వర్ణ చిత్రాల దృశ్యాలు
చిత్రిస్తున్న నీ కోమల
ముని వేళ్ళ మధ్య
సుతారంగా కొంచెనై
ప్రభవిస్తున్నా-
వెన్నెల జల్లుల్లో
పాలరాతి శిల్పంలా
కరుగుతున్న నీ తనువులో
వలపునై
మలయ సమీరాన్నై
శాంతి గీతాలు ఆలపిస్తున్నా-
లతాంగీ!
వలపు ప్రతీకల పడవల్లో
ప్రతినిత్యం ప్రేమమయమై
పరుగులు తీస్తున్న
కాలాన్ని ఆపేద్దాం
ప్రణయామృత బృందావనంలో
సందడి చేద్దాం
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి