telugu navyamedia
రాజకీయ వార్తలు

దశాబ్దాల తమ కల నెరవేరింది.. లడఖ్ లో ప్రజల సంబరాలు!

ladak people

జమ్ముకశ్మీర్ నుంచి విడగొట్టి తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై లడఖ్ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లడఖ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. జనాలంతా రోడ్లపైకి వచ్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతకాలానికి లడఖ్ ప్రజల కల నెరవేరిందని లడఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్భంగా బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కున్ జాంగ్ మాట్లాడుతూ తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తుండటంతో తమ కల నెరవేరిందని చెప్పారు. ఈరోజు కోసం తామంతా ఎంతగానో ఎదురు చూశామని అన్నారు.

జమ్ముకశ్మీర్ నుంచి విడిపోవాలని, తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని తాము 1949 నుంచి ఆరాటపడుతున్నామని తెలిపారు. ఈ 70 ఏళ్ల కష్ట సమయంలో తమ కలను నెరవేర్చుకునేందుకు తాము ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. ఆలస్యంగానైనా తమ కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన ఘనత బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని కున్ జాంగ్ అన్నారు. గత 7 దశాబ్దాలలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ తాము మాత్రం బాధితులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఈరోజు ప్రధాని మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, లడఖ్ ప్రజలంతా మోదీకి, బీజేపీకి కృతజ్ఞులుగా ఉంటామని చెప్పారు.

Related posts