*తాను రాజీనామా చేశాకే నియోజకవర్గానికి నిధులు వచ్చాయి
*రేపు గెలిచేది నేను కాదు..మునుగోడు ప్రజలు
*ఈ నెల 21 మునుగోడుకుఅమిత్ షా వస్తున్నారు.
తెలంగాణ తో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనతన పదవికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాల్లో రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా రాత్రికి రాత్రి పోస్టర్లు వేశారు.
ఈ విషయం తెలుకున్న రాజగోపాల్ రెడ్డి తనకు వ్యతిరేక పోస్టర్లపై స్పందించారు..తనను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. మునుగోడుతో పాటు తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై తాను ప్రశ్నించానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒకపార్టీలో గెలిచి మరోపార్టీలో ఉంటోన్న వారిని పట్టించుకోలేదన్నారు.
12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నాడు లేనిది.. ఇప్పుడు తాను మారితే తప్పేంటని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించాకే మునుగోడుకు నిధులొచ్చాయని గుర్తు చేశారు. తన రాజీనామా తర్వాతే చేనేతలకు బీమా ప్రకటించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా అంటే గౌరవం ఉందని చెప్పినా.. తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరిగేదే మునుగోడు ఉపఎన్నిక అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయే వ్యక్తి ఉపఎన్నికకు ధైర్యంగా వెళ్లగలనా? అని ప్రశ్నించారు.
కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 21న జరిగే మునుగోడు బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.