హుజూర్ నగర్ నియోజవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం మొదలైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.
హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఉప ఎన్నిక రాష్ట్రానికి మార్గదర్శకం కావాలన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.