తెలంగాణ సీఎం కేసీఆర్ కుర్చి పోయే కాలం వచ్చిందని భువనగిరి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హయత్ నగర్ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కార్మికులు ఎవరు అధైర్యపడవద్దని, తమ వెంట నాలుగు కోట్ల ప్రజలున్నారని ధైర్యం చెప్పారు.
కిరాయి డ్రైవర్స్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని తెలిపారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వందల కోట్లు ఖర్చు పెడుతోందని, అయినా ఓటమి తప్పదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.