కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో రూ. 110 కోట్ల నిధులతో చేపట్టిన అర్బన్ భగీరథ తాగునీటి సరఫరాను ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ పక్కనే మానేరు నది ఉన్నప్పటికీ కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందేది కాదని చెప్పారు.
కానీ ఇప్పుడు అర్బన్ భగీరథ మిషన్ ద్వారా ప్రజలకు నిరంతరం నీటిని అందిస్తున్నామని అన్నారు. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు నిరంతరం నీటిని అందించిన ప్రజానేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పుట్టడం ఒక అదృష్టమని, ఆయన కడుపున కేటీఆర్ పుట్టడం మరో అదృష్ణమని అన్నారు.