telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ విముక్తి ఏపీయే మా ల‌క్ష్యం..-పవన్ కళ్యాణ్

*వైసీపీ విముక్తి ఆంద్ర‌ప్ర‌దేశ్ మా ల‌క్ష్యం
*వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం..
*టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం

*జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..

వైఎస్ఆర్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ను మా ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.ఈ మేరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకుని అధికారికంగా తీర్మానం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పవన్  స్పష్టం చేశారు.

వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి తెలిపారు. టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పాటిస్తామని… ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులను బట్టి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామన్నారు. తమ స్ట్రాటజీ తమకు ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఏపీకి హానికరమని స్ఫష్టం చేశారు.

తమ పార్టీకి సంబంధించిన వ్యూహాలు తమకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారని..కానీ కేసీఆర్ ఆ తరువాత మనసు మార్చుకున్నారన్న పవన్ కళ్యాణ్.. అది వారి వ్యూహమని అన్నారు.

పార్టీలోని ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కొందరు తనను వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీని నష్ట పెట్టే వారి కంటే ప్రత్యర్ధులు గెలవడమే బెటర్ అని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

మీ తప్పులు సరిదిద్దుకోవాలని కూడా పార్టీ నేతలను కోరినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని కూడా పవన్ కళ్యాణ్ నిర్మోహామాటంగా ప్రకటించారు. పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా కూడా సస్పెండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు

పాదయాత్ర చేసిన వారందరూ వినోదా భావేలు కారని.. పాదయాత్ర చేసిన వారు ఆంధ్రా థానోస్‌గా మారిన వాళ్లూ ఉన్నారని పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్పేరుతో ఎన్నికలకు వెళతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన జీరో బడ్జెట్ అంటే అర్ధం వేరే విధంగా చేసుకుంటున్నారని.. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు కనీసం టీ కూడా ఇప్పించడం లేదని చెప్పారు. మనం ఒక లక్ష్యంవైపు వెళ్తుంటే.. మరికొందరు వారి వారి స్థాయిలో కిందకు లాగడానికి చేస్తుంటారని చెప్పారు.

పెట్టుబడికి అనుకూలంగా లేనంతకాలం రాయలసీమ వెనుకబడే ఉంటుందని చెప్పారు.సీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలని..పరోక్షంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి మండిపడ్డారు. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై దాడి చేసినట్లు దాడి చేస్తారని విమర్శించారు. గొడవల మధ్య రాయలసీమలో అభివృద్ధి చెందడం లేదన్నారు. సీమ యువత అంతా ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తోందన్నారు.

Related posts