ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయగా కేబినెట్ మంత్రుల చేత ప్రమాణం చేయించలేదు. మంత్రుల చేత జూన్‌లో ప్రమాణం చేయించాలని జగన్ భావించారు. ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలి..? ఏ జిల్లా నుంచి ఎంతమందిని కేబినెట్‌లోకి తీసుకోవాలి..? ఇలా అన్ని విధాలా ఆయన కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ కు జూన్ 8న వైఎస్ జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ నెల 7న ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ నిశితంగా చర్చించనున్నారు. మంత్రుల ఎంపికపై శాసన సభ్యులతో చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.