telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం..

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన..చాలా ప్రాంతాల్లో దంచికొట్టింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది.

భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్‌ ముసారాంబాగ్‌ బ్రిడ్జ్‌ నీటమునిగింది. అంబార్‌పేటలోని బాపూనగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. అంబర్‌పేట-ముసారాంబాగ్‌ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ సరిసరాలు జలమయం అయ్యాయి. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. గండిపేట చెరువుకు భారీగా వరద, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

దీంతో..జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్‌, మాన్సూన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావొద్దని కోరుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

Related posts