జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ వార్డులో ఒక మసీదును ఎంపికచేసి అక్కడ పేద ముస్లింలకు విందు భోజనం ఏర్పటుచేయడంతోపాటు దుస్తులతోకూడిన బహుమతిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(టీఎస్‌సీఓ) నుంచి వీటిని కొనుగోలుచేస్తున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీచేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వార్డుకు ఒకటి చొప్పున మసీదును ఎంపికచేసి కనీసం 500మందికి బహుమతులు పంపిణీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పెద్ద మసీదుల్లో ఇంతకన్నా ఎక్కువమందికి పంపిణీచేయనున్నారు. విందు కార్యక్రమానికి ఒక్కో మసీదుకు రూ లక్ష పంపిణీచేస్తున్నారు.
ఈ కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్, అధికారులు, మసీదు కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బహుమతి కింద దుస్తులను పంపిణీచేయనున్నారు. బహుమతులు ఈనెల 21న వస్తాయని, అనంతరం ఆయా మసీదు కమిటీలకు వాటిని పంపిణీచేస్తామని అధికారులు తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో రంజాన్ పండుగ ఉన్నందున పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వీలుందని వారు పేర్కొన్నారు.
స్థానిక మసీదు కమిటీలు లబ్దిదారులను ఎం పికచేయనున్నాయి. పేద ముస్లింలందరికీ బహుమతులు పంపిణీచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా మసీదు కమిటీలు తమ పరిథిలోని లబ్దిదారుల జాబితా సిద్ధంచేస్తే దాన్ని ఆధారంగా వారికి బహుమతులు పంపిణీచేస్తామని వారు తెలిపారు. 21వ తేదీన బహుమతులు తమకు అందనున్నట్లు, అనంతరం వాటి స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, మసీదు కమిటీలు వాటి పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటాయని అధికారులు వివరించారు.