telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఉప్పొంగిన గోదావరి.. 400 గ్రామాలు జలమయం

huge rain water flow in godavari useful for farmers

గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. అంతకంతకూ పెరుగుతున్న వరదతో పరీవాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యేరు, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు నీటమునిగాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

దేవీపట్నం, తొయ్యేరు రహదారిపై 4 అడుగుల మేర ప్రవాహం పారుతోంది. లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పి.గన్నవరం మండలం చాలకలిపాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. నాలుగు రోజులుగా కరకాయ లంక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బూరుగులంక, హరిగెలవారిపేట, జి.పెదపూడి లంక, అయోధ్యలంక, అనగారిలంక వాసులు మరబోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు.

గండిపోచమ్మ అమ్మవారి విగ్రహం వద్ద రెండు అడుగుల మేర వరద నీరు నిలిచింది. చాలా ప్రాంతాల్లో అరటి తోటలు నీట మునిగాయి.
ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా. 9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద ప్రస్తుతం 11.2 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ఉండటంతో సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశముంది.

Related posts