telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

భారత్ – వెస్టిండీస్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు

India westendies cricket

భారత్, వెస్టిండీస్ టి20ల సిరీస్ లో భాగంగా రేపు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే భారత్ – వెస్టిండీస్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. మ్యాచ్ ఏర్పాట్లపై మహేశ్ భగవత్ ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.హైదరాబాద్ క్రికెట్ సంఘంలో కొత్తగా కొలువుదీరిన అజహరుద్దీన్ కార్యవర్గం చేపడుతున్న తొలి మ్యాచ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

మ్యాచ్ కోసం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని, బ్లాక్ డే సందర్భంగా ఎవరైనా మ్యాచ్ ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉప్పల్ మ్యాచ్ కోసం 1800 మంది పోలీసులను భద్రతా విధుల కోసం రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. త్రివర్ణ పతాకం తప్ప మరే ఇతర జెండాలు స్టేడియంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు.

మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్టేడియం గేట్లు సాయంత్రం 4 గంటలకే ఓపెన్ చేస్తామన్నారు. ఒకసారి స్టేడియంలోకి ప్రవేశించిన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. ల్యాప్‌టాప్, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బ్యానర్లు, సిగరెట్లు, హెల్మెట్లు, బ్యాటరీలు, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్‌తో పాటు ఆహార పదార్థాలను స్టేడియం లోపలికి అనుమతించం అని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.

Related posts