telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పై గంభీర్‌ కీలక వ్యాఖ్యలు…

ఈ సీజన్లో తొలి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడింది. ఆ మ్యాచ్‌లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండు బంతులు ఆడిన మహీ.. అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దాంతో అతడి ఆటకు ఎన్నో రోజులు వేచిచూసిన ధోనీ అభిమానులు నిరాశ చెందారు. యూఏఈలో గతేడాది జరిగిన ఐపీఎల్‌లోనూ మహీ మోస్తరు ప్రదర్శనే చేశాడు. కీలక సమయంలో ఒత్తిడి తట్టుకోలేక పెవిలియన్ చేరాడు. జట్టు కోసం మునుపటిలా మ్యాచ్‌లను ముగించలేకపోయాడు. కెప్టెన్సీలో కూడా గతంలోని మార్క్ కనబడలేదు. మొత్తానికి ఐపీఎల్ 2020లో చెన్నై 7వ స్థానంతో ముగించింది. ఈ విషయం పై గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ… ‘నాయకుడు జట్టును ముందుండి నడిపించాలని మేం ఎప్పుడూ చెబుతున్నాం. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, జట్టును నడిపించడం కష్టం. ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా రావాలి. అప్పుడే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెన్నై బౌలింగ్‌ విభాగంలో సమస్యలు ఉండటం నిజమే. ఇక మహీ ఇంతకుముందులా ఆడటం లేదు. క్రీజులోకి రావడంతోనే బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోతున్నాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడలేకపోతున్నాడు. నా ఉద్దేశం ప్రకారం మహీ నాలుగు లేదా ఐదో స్థానంలో రావాలి’ అని గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. ఇక ఢిల్లీ కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లోయర్ రన్‌రేట్ కారణంగా ఎంఎస్ ధోనీపై ఇప్పటికే 12 లక్షల రూపాయల జరిమానా పడిన విషయం తెలిసిందే.

Related posts