ఇసుక కృత్రిమ కొరతను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి దోపిడీకి తెరలేపిందని ఆరోపిస్తూ రవీంద్ర 36 గంటలపాటు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతల జేబులు నింపేందుకే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని, ఇసుక కొరతకు నిరసనగా నగరంలోని కోనేరు సెంటర్‌లో దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం దీక్షకు సిద్ధమైన రవీంద్రను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనప్పటికీ ఆయన కోనేరు సెంటర్‌కు చేరుకున్నారు. చెప్పినట్లుగానే దీక్షకు ఉపక్రమించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రవీంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు పెద్దఎత్తున టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీక్ష శిబిరం వద్ద రవీంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్టు చేస్తోందన్నారు. రవీంద్రను అదుపులోకి తీసుకునేందుకు టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం శిబిరాలకు అనుమతులు లేవని అడిషనల్ ఎస్పీ సత్తిబాబు తెలిపారు. డీఆర్సీ సమావేశం ఉన్నందున దీక్షలు, శిబిరాలకు అనుమతులు నిరాకరించినట్లు ఆయన చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని సత్తిబాబు స్పష్టం చేశారు. ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదని ఆయన పేర్కొన్నారు.