ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం 25 వేల మంది హోంగార్డులను తొలగించే నిర్ణయంపై వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ హోంగార్డులో విధుల్లో కొనసాగుతారని తెలిపింది. అ అంశంలో యోగి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటికే యుటర్న్ తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా హోంగార్డులను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఈనెల 12వ తేదీన ప్రభుత్వం ప్రకటించగా, హోంగార్డుల వారి ఉద్యోగాలను కోల్పోరని తరువాత హోంమంత్రి చేతన్ చౌహాన్ చెప్పారు. హోంగార్డుల వేతనాలను హోమ్ శాఖ బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు ప్రభుత్వ ఆదనపు ప్రధాన కార్యదర్శి తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం పండుగ సీజన్ కారణంగా హోంగార్డులు విధుల్లో ఉండాల్సిన అవసరం ఉందని చౌహాన్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 1.18 లక్షల హోంగార్డుల పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం 19 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది పోలీసుల స్థానంలో 25 వేల మంది హోంగార్డులను హోంమంత్రిత్వ శాఖ నియమించింది. ఇటీవల వీరి సేవలను నిలిపేసిన ప్రభుత్వ తిరిగి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కొనసాగింపునకు నిర్ణయం తీసుకుంది. హోంగార్డులను రోజుకు రూ.672 వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నా ప్రభుత్వం నేటికి కూడా వారికి రూ.500 మాత్రమే ఇస్తోంది. వారికి నెలవారీ వేతనాలంటూ లేవు. ఎన్ని రోజుల విధులకు హాజరైతే దాన్ని బట్టి వేతనం చెల్లించే వారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు లక్ష మంది హోంగార్డులకు వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవని ప్రభుత్వం చేతులెత్తేసింది.