telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : షాపింగ్‌మాల్స్ లో .. క్యారీ బ్యాగ్ .. ఉచితం..

free carry bag from now in shopping malls

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం .. షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. లోగో ముద్రించి ఉంటే ఉచితంగానే క్యారీబ్యాగ్ ఇవ్వాలని చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది. ఇందుకు విరుద్ధంగా క్యారీబ్యాగ్‌ను వినియోగదారుడికి విక్రయించిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్ మాల్‌కు రూ.ఏడువేల జరిమానా విధించింది. ఉప్పల్ నివాసి శ్రీకాంత్ గతనెల 18న షాపర్స్‌స్టాప్‌లో వస్తువులు కొనుగోలు చేయగా.. ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన క్యారీబాగ్‌కు రూ.ఐదు వసూలుచేశారు. క్యారీబ్యాగ్‌కు చార్జీ చేస్తున్నందున ఎలాంటి లోగో ముద్రించని బ్యాగ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన శ్రీకాంత్ తనకు జరిగిన అసౌకర్యాన్ని పౌరసరఫరాలభవన్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన అధికారులు షాపర్స్‌స్టాప్‌కు జరిమానా విధించారు.

లోగో ముద్రించని వాటిపై చార్జీ వసూలు చేసుకోవచ్చునని ఫోరం స్పష్టంచేసింది. మరోవైపు రామంతపూర్ నివాసి శ్రీనయ్య పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని కల్యాణ్ జ్యువెలర్స్‌లో గోల్డ్‌స్కీం కింద ప్రతినెలా డబ్బు చెల్లించారు. స్కీం విలువ రూ.1.1 లక్షలుకాగా, కల్యాణ్ జ్యువెలర్స్ యాజమాన్యం రూ.1.04 లక్షలకే బిల్లు ఇచ్చింది. వినియోగదారుడు కొనుగోలు చేసిన బంగారునగల బిల్లుపై తరుగు వివరాలు రాయలేదు. దీనికి కారణం చెప్పాలని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దాంతో శ్రీనయ్య వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించి కల్యాణ్ జ్యువెలర్స్‌కు నోటీసులు పంపారు. తప్పు గుర్తించిన సంస్థ వినియోగదారుడికి పరిహారం కింద రూ.30వేలు చెల్లించింది. చాలా తక్కువ సమయంలో న్యాయం జరుగటంతో ఫోరంకు వినియోగదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts