telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

PRanab

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ నెల 10వ తేదీన ప్రణబ్.. ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్‌కు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన అస్వస్థతకు గురవడంతో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ప్రణబ్ కు కరోనా సోకినట్టు తెలిసింది. అప్పట్నుంచీ వైద్యులు ప్రణబ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆస్పత్రిలో చేరిన దగ్గర్నుంచీ ప్రణబ్ ఆరోగ్యం విషమిస్తూ వచ్చింది. ఆ తర్వాత కోమాలోకి, చివరకు డీప్ కోమాలోకి వెళ్లిన ప్రణబ్.. కొన్ని గంటల క్రితమే సెప్టిక్ కోమాలోకి వెళ్లారు. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వైద్యులు ప్రకటించారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ.. చికిత్సకు స్పందించకపోవడంతో చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. మేధావిగా, రాజకీయ దురంధరుడిగా పేరున్న ప్రణబ్.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సంక్షోభ పరిష్కర్తగా ఉన్నారు. కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా తన బాధ్యతల్ని నిర్వర్తించిన ప్రణబ్.. అన్ని పార్టీల నేతల గౌరవాన్నీ పొందారు. ప్రణబ్ రాష్ట్రపతి అయ్యేదాకా.. పార్టీలో ఏ సమస్య వచ్చినా.. దాని పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రణబ్ వైపే చూసేది. కాంగ్రెస్ వార్ రూమ్ లో దేశ పౌరుల భవిష్యత్ ను మలుపు తిప్పిన ఎన్నో నిర్ణయాలపై జరిగిన చర్చల్లో ప్రణబ్ ముఖర్జీదే ప్రధాన పాత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా కాంగ్రెస్ ప్రణబ్ కమిటీనే నియమించింది. ఆ తర్వాతే సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపింది.

Related posts