telugu navyamedia
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి..ప‌లువురికి గాయాలు

సికింద్రాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో ఉన్న‌ 8 మంది సజీవ దహనమయ్యారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ-స్కూటర్‌ షోరూమ్‌లోని బ్యాటరీలు పేలడంతో.. పైఅంతస్తుల్లో ఉన్న లాడ్జిలో పర్యాటకులు ప్రమాదం బారిన పడ్డారు.

అస‌లు ఏం జ‌రిగిదంటే?

సికింద్రాబాద్‌లోని రూబీలాడ్జి కింద ఉన్న ఇ-ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టారు. ఈ సమయంలోనే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఆ తర్వాత పక్కనే ఉన్న సుమారు 40- నుంచి 50 వరకు పార్కింగ్‌ చేసి ఉంచిన బైక్‌ల బ్యాటరీలు బాంబుల్లా పేలాయి. కేవలం నిమిషాల వ్యవధిలో భారీశబ్ధంతో బ్లాస్టయ్యాయి. దాంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు, పొగ, పై అంతస్థుకి వ్యాపించడంతో లాడ్జిలో ఉన్న టూరిస్టులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. కొందరు లాడ్జి కిటిలనుంచి బయటకు వచ్చి కిందకు దూకేశారు. వారంతా స్వల్పంగా గాయపడ్డారు. మరో 10 మంది పైపులు పట్టుకొని సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఈ ఘటనతో అలర్టయిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షోరూం పైన లాడ్జి ఉండడంతో అందులో పెద్ద సంఖ్యలో పర్యటకులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ప్రయత్నం చేశారు.

కాగా ..నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూబీ హోటల్ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

Related posts