తానా మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి నవనీతకృష్ణ(73) ఆమెరికాలో గురువారం మృతి చెందారు. గొర్రెపాటి విద్యాట్రస్టు ఛైర్మన్, ఎన్నారై గొర్రెపాటి రంగనాథబాబుకు ఆయన స్వయానా సోదరుడు. ఘంటసాల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నవనీత కృష్ణ గతంలో ప్రోత్సాహకాలు అందించారు.
ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు నిర్వహించేవారు. నవనీత కృష్ణ మృతి పట్ల ఘంటసాల మండలానికి చెందిన తెదేపా నేతలు తుమ్మల చౌదరి బాబు, గొర్రెపాటి వెంకటరామకృష్ణ, వైకాపానేత వేమూరి ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు అమెరికాలో జరుగుతాయని బంధువులు తెలిపారు.