స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో కాగితం వాడకం లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సభ్యులకు సూచించారు. దీని వల్ల చెట్లను రక్షించిన వాళ్లమవుతామని, అంతేగాక కోట్లాది రూపాయాలు ఆదా అవుతాయని సభాపతి అన్నారు. ఈ చర్యల్లో భాగంగా సభ్యులు తమ డాక్యుమెంట్లను డిజిటల్ కాపీ రూపంలో తీసుకురావొచ్చని సలహా ఇచ్చారు. శూన్యగంట సమయంలో మాట్లాడుతూ స్పీకర్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యం కాదని, దశలవారీగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని బిర్లా సూచించాడు. ‘పేపర్ల ముద్రణ కోసం కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందుకే లోక్‌సభను కాగిత రహితంగా మార్చాలి’ అని ఓం బిర్లా అన్నారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఈ ఆలోచన చాలా గొప్పదని ప్రశంసించారు. అయితే డిజిటల్ డాక్యుమెంట్లతో రావాలంటే సభలో ఎల్లప్పుడూ వైఫై అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు.