telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

దేశం దారిత‌ప్పుతోంది..చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశం కోసం ప‌ని చేస్తా..

*మల్లన్న సాగర్‌ కాదు ..ఇదితెలంగాణ జన హృదయ సాగరం
*దేశం దారిత‌ప్పుతోంది..చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశం కోసం ప‌ని చేస్తా..
*బీజేపీపై మ‌రోసారి విరుచుకుప‌డ్డ కేసీఆర్‌..
*కులాలు మ‌తాలు పేరుతో కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారు
*కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వానికి దేశం నుంచి త‌రిమి కొట్టాలి ..
*మ‌ల్ల‌న్న కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు..
*దేశాన్ని గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా..

*దేశంలో తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ

దేశం దారి తప్పుతోంది..దేవుడు నాకిచ్చిన శక్తిని కూడదీసుకొని, చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశం కోసం ప‌ని చేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని… జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామన్నారు.

ఈ దేశంలో దుర్మార్గమైన, జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయి. బెంగళూరులో మ‌తం పేరుతో కల్లోలం రేపారు. అక్కడికి పోవాలంటే అంతా భయపడుతున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్‌ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. భారీ మట్టికట్టతో…. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేసి జలాశయం కలను సాకారం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి​ చేశారని అన్నారు. తెలంగాణ సస్యశ్యామల కావాలని కోరుకున్నామని తెలిపారు. నూతన తెలంగాణ నిర్మించుకున్న అతిభారీ ప్రాజెక్టు మల్లన్న సాగర్‌ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌ అని చెప్పారు. కాళేశ్వరంలో 58 వేలమంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు.

ప్రాజెక్టు పనులు ఆపాలని కొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. ప్రాజెక్టును ఆపే కుట్రతో వందలాది కేసులు వేశారని తెలిపారు. ఎందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ముందుకెళ్లామని అన్నారు.

గోదావరి నీళ్లతో కొమురవెల్లి మల్లన్న కాళ్లు కడుగుతామని అప్పుడే చెప్పా అని, హైదరాబాద్‌కు దాహార్తిని తీర్చే మహత్తర ప్రాజెక్టు.. మల్లన్న సాగర్‌.

ఇది మల్లన్నసాగర్‌ కాదు.. తెలంగాణ జన హృదయ సాగరం అని అభివర్ణించారు. కాళేశ్వరం నిర్మాణంలో హరీశ్‌రావు పాత్ర ఎనలేనిది సీఎం తెలిపారు. తెలంగాణకు అధ్బుతమైన పరిశ్రమలు వస్తున్నాయని, దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

 

Related posts