telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆస్తుల నమోదు సులభతరం..మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ సీఎస్

ధరణి ప్రాజెక్టు కోసం వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) సహా అన్ని నగరపాలికలు, పురపాలక సంస్థల్లో  ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయన్నారు.  ఆస్తుల యజమానులు www.npb.telangana.gov.in ను ఉపయోగించి స్వయంగా,  మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని  ఆయన సూచించారు. సంబంధిత మార్గదర్శకాలపై శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు  24,400 మంది అధికారులు ఇంటింటికీ తిరిగి యజమానులు ఇచ్చిన వివరాలను మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేశారని,  శనివారం వరకు ఇలా 75.74 లక్షలకు పైగా ఆస్తులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర నగరపాలక, పురపాలక సంఘాల కోసం రెండు పద్ధతుల్లో నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు వాటి యజమానులు ఈ కింది సమాచారాన్ని జతచేయాలని సీఎస్‌ సూచించారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్‌) లేదా పన్ను రసీదు, ఆధార్‌ సంఖ్య (మోసపూరిత లావాదేవీల నివారణకు), మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ (ఆస్తుల సమాచారం ఇవ్వడానికి), ఆధార్‌ సంఖ్యలతో పాటు యజమాని ధ్రువీకరించే కుటుంబ సభ్యుల వివరాలు (ఆస్తి హక్కుల కల్పనకు), జేపీజీ రూపేణా యజమాని ఫొటో (పాస్‌బుక్‌లో ముద్రించేందుకు), ఫ్లాట్‌ విస్తీర్ణం, నిర్మించిన ప్రాంతంతో పాటు అవిభక్త వాటా, చిరునామా జతపరచాలని పేర్కున్నారు.

Related posts