telugu navyamedia
క్రీడలు వార్తలు

ధోనీ అంటే నమ్మకం..గౌరవం

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టైటిల్ కోసం జూన్ 18వ తేదీన భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌‌లోని హ్యాంప్‌షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఆడబోయే భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం క్వారంటైన్‌లో కాలం గడుపుతోంది. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వారం రోజుల క్వారంటైన్ సమయం ఇవ్వాళ్లితో ముగియనుంది. వారిద్దరితో పాటు కోచ్ రవిశాస్త్రి కూడా క్వారంటైన్ నుంచి బయటికి రానున్నారు. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించాడు. In quarantine..Ask me your questions పేరుతో టైమ్‌పాస్ చేశాడు. అభిమానులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చాడు. ఈ సందర్భంగా అతను టీమిండియా ఏస్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఛాట్ చేశాడు. వారిద్దరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పట్ల ఉన్నఅభిప్రాయాన్ని రెండు ముక్కల్లో చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని కోరాడు అశ్విన్. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ పట్ల తన మనసులో మాటను బయటపెట్టాడు కోహ్లీ. ధోనీ అంటే తనకు నమ్మకం..గౌరవం ఉన్నాయని రెండు ముక్కల్లో తేల్చేశాడు. టీమిండియాకు ఎంపికైన తొలిరోజుల్లో తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాకు ఎంపికైతే చాలనుకున్నానని, బెంచ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఉండాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పారు. అలాంటిది జట్టుకు నాయకత్వాన్ని వహిస్తానని ఊహించలేదని అన్నాడు. ధోనీ వారసుడిగా తనను అభిమానులు గుర్తించడం మరింత ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నాడు.

Related posts