టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్(104*; 186 బంతుల్లో 9×4, 1×6) శతకం సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్ నిలబెట్టాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నిదానంగా ముందుండి నడిపించాడు. ట్రావిస్ హెడ్(35)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత పీటర్ సిడిల్(44; 85బంతుల్లో 4×4)తో తొమ్మిదో వికెట్‌కు 88 పరుగులు చేసి మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును 200 దాటించాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ బౌలింగ్‌లో 73 ఓవర్‌లో నాలుగో బంతిని బౌండరీకి తరలించి స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.