telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ : .. గ్రూప్ 2 ఫలితాలు .. విడుదల..

funds to telangana by central govt

రాష్ట్రంలో దీర్ఝకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్ 2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 1032 పోస్టులకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. 1027 పోస్టులను భర్తీ చేసిన టీఎస్‌పీఎస్సీ మిగిలిన 5 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఫలితాలు తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని వివరించింది. 2016, సెప్టెంబర్‌లో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016, నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరిగింది. అయితే, పరీక్ష విషయంలో పలువురు కోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 రాతపరీక్షల్లో సరిగా బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారిని మౌఖిక పరీక్షలకు(ఇంటర్వ్యూలకు) అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దాదాపు ఏడాదిన్నర పాటు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ…వైట్‌నర్ వాడిన, డబుల్ బబ్లింగ్ ఉన్న సమాధాన పత్రాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసి, వైట్‌నర్ వాడిన వారిని తొలగించి.. మిగతా వారికి ఇంటర్వ్యూ నిర్వహించడానికి కోర్టు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ తహసీల్దార్లుగా 259 మంది, ఎక్సైజ్‌ ఎస్సైలుగా 284 మంది, వాణిజ్య పన్నుల అధికారులుగా 156 మందిని, మిగిలిన వారిని మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులుగా నియమించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 5 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వారీగా, పోస్టుల వారీగా ఎంపికైన వారి వివరాలను వెబ్‌సైట్ లో పొందుపర్చారు.

Related posts