వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను బయటపెట్టింది. 2017లోనే జగన్ అక్రమాలను నిర్ధారించినా… విచారణను తొక్కిపెట్టినట్టు ఆ లేఖలో ఉన్నట్టు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే మోదీకి జగన్ సరెండర్ అయ్యారని మండిపడింది. టీడీపీ ఇప్పుడు బయటపెట్టిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 8 సంస్థలతో జగన్ కు క్విడ్ ప్రోకో ఉందని అప్పటి సీబీఐ డైరెక్టర్ ఆస్థానాకు అప్పటి ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ లేఖ రాశారు. జగన్ కేసుల్లో మరింత స్పష్టమైన విచారణ జరపాలని… అప్పుడే పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. ఈ లేఖనే ఇప్పుడు టీడీపీ బయటపెట్టింది. ఈడీ లేఖ రాసినప్పటికీ… సీబీఐ పట్టించుకోలేదని… విచారణ ముందుకు సాగలేదని ఆరోపించింది.
సండూర్ పవర్ కంపెనీ, కార్మెల్ ఇండియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ తో జగన్ కు క్విడ్ ప్రోకో ఉందని లేఖలో కర్నాల్ సింగ్ తెలిపారు. క్విడ్ ప్రోకో ఆధారాలు లేవని సీబీఐ ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి మెమోను కోర్టులో ప్రవేశపెట్టడం వల్ల… ఈడీ చేసిన దర్యాప్తును కూడా నిలిపివేయాలని జగన్ న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్విడ్ ప్రోకోకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2009లో ఇందూ గ్రూపుకు దాదాపు 100 ఎకరాల భూమిని ఇచ్చారని… వాటిలో 11 ఎకరాలను జగన్ బినామీ సంస్థలకు ఇందూ గ్రూపు ఇచ్చిందని కర్నాల్ సింగ్ పేర్కొన్నారు. కూకట్ పల్లిలో ఉన్న ఈ స్థలం ఇప్పటికీ జగన్ అధీనంలో ఉందని తెలిపారు. క్విడ్ ప్రోకోకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని… ఈ నేపథ్యంలో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ