కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో కీలక సంస్కరణ చేస్తూ తొలి మహాదళాధిపతి(సీడీఎస్) నియామకం చేపట్టింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్‌ను నియమించింది. అయితే ఈ అంశంపై కేంద్రం తప్పటడుగు వేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దేశం అద్భుతమైన మార్గంలో పయనిస్తోందా అని ప్రశ్నించింది. సీడీఎస్ నియామకంపై కేంద్రం తీవ్రమైన తప్పటడుగు వేసింది. ఈ నిర్ణయం వల్ల ఎదురయ్యే సమస్యలను దురదృష్టవశాత్తూ కాలమే తెలియజేస్తుంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ హోదా వల్ల ఎలాంటి పర్యవసనాలు ఉంటాయి. మిగతా మూడు దళాల అధిపతుల సలహాలను సీడీఎస్ సలహాలు అధిగమిస్తాయా.. అని తివారీ ప్రశ్నించారు. ఇకపై త్రివిధ దళాల అధిపతులు రక్షణమంత్రికి రక్షణశాఖ కార్యదర్శి ద్వారా నివేదించాలా లేదా సీడీఎస్ ద్వారా నివేదించాలా? అని కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
భారత తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్‌ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటైన సైనిక వ్యవహారాల విభాగానికి నాయకత్వం వహిస్తారు. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా వ్యవహరిస్తారు.