telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే : సి. కళ్యాణ్‌

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ పాలనపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు సి. కళ్యాణ్‌ ప్రసంశలు కురిపించారు. ‘కేసీఆర్ ఓ పద్థతి ప్రకారం నడిచే మనిషి. ఎన్నికల్లో గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకుని మాట మార్చే మనిషికాదు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సినిమా వాళ్ళకు ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నెరవేర్చుతారనే నమ్మకం ఉంది’ అంటున్నారు సి. కళ్యాణ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ విజయం సాధించకపోయినా… మేయర్ పీఠంపై ఆ పార్టీ నేత కూర్చోవడం ఖాయమని సి. కళ్యాణ్ అంటున్నారు. హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయిలో డెవలప్ చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని, దానిని ఆయన నెరవేర్చుతారని సి. కళ్యాణ్ చెబుతున్నారు. ఇటీవల తెలంగాణాలో సినిమా థియేటర్లు తెరుచుకున్నా… తెలుగు సినిమాలు మాత్రం విడుదల కాలేదు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి ఎగ్జిబిటర్స్ ను కొన్ని కోరికలు కోరింది. వాటిని అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ ను, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నామని సి. కళ్యాణ్ అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎవరికీ నష్టం కలగకుండా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలానే నూరు శాతం ఆక్యుపెన్సీ కోసం కృషి చేస్తున్నామని, అప్పటి వరకూ కొన్ని ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు.

Related posts