మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారం అర్థరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈమేరకు మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో పాటు శుక్రవారం రాజ్‌భవన్ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. నా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడణవీస్ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని విషయం తెలిసిందే. శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ వారిద్దరి మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీ నేత చేపట్టబోతున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.