telugu navyamedia
రాజకీయ

సోనియాను 6 గంటల పాటు ఈడీ ప్రశ్నల వర్షం..మరోసారి రావాలంటూ సమన్లు.

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈరోజు ప్రశ్నించడం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు అతడిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. బుధవారం మరోసారి విచారణకు ఈడీ రావల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది.

రెండోవిడత విచారణలో భాగంగా సోమవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా ఉదయం 11 గంటలకు… కుమారుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంక అక్కడే ఉండగా రాహుల్‌ పార్లమెంటుకు వెళ్లిపోయారు. రెండున్నర గంటల పాటు సోనియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి సోనియా విచారణకు హాజరయ్యారు.

ప్రియాంక ఈడీ కార్యాలయంలోని మరో గదిలో ఉంటోందని, తద్వారా ఆమె తన తల్లిని కలవవచ్చని.. అవసరమైతే ఆమెకు మందులు లేదా వైద్య సహాయం అందించవచ్చని అధికారులు తెలిపారు.

మొత్తంగా ఇవాళ 6 గంటల పాటు సోనియాను ఈడీ ప్రశ్నించింది. బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. రెండు రోజుల విచారణలో భాగంగా సోనియాను 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలనే సోనియాను అడిగినట్లు పేర్కొన్నాయి.

ఈనెల 21న ఈ కేసుకు సంబంధించి తొలిసారి సోనియాను ప్రశ్నించిన అధికారులు… గత శుక్రవారం మళ్లీ సమన్లు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సోనియా విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related posts