telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జనసేన నేత ఎస్పీవై రెడ్డి మృతిపై.. ప్రముఖుల సంతాపం..

condolence to spy reddy death

జనసేన నేత ఎస్పీవై రెడ్డి (69), గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన విశేష సేవలు అందించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు. గత నెలలో జనసేన చీఫ్ పవన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏప్రిల్ 3న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో జనసేన శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

ఎస్పీవై రెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. నంది గ్రూపు సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప మనిషి ఎస్పీవై అని కొనియాడారు. ఆయన మృతి కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి తీరని లోటన్నారు. ఎంపీగా ఆయన విశేష సేవలు ప్రశంసనీయమన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎస్పీవై రెడ్డి మృతి వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం పాటించిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయన అనుభవం, సేవాగుణం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందనే జనసేనలోకి ఆయనను ఆహ్వానించినట్టు చెప్పారు.

Related posts