తెలంగాణ లో పరిషత్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్నది. మధ్యాహ్నం నుంచి ఫలితాల ట్రెండ్ తెలిసిపోనున్నది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తిచేసేలా ఈసీ చర్యలు చేపట్టింది. మొత్తం 2,426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,930 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనున్నది. గత నెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసీ తొలుత నిర్ణయించింది. జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు దాదాపు 42 రోజుల సమయం ఉండటం, క్యాంపులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయనే ఫిర్యాదులతో కౌంటింగ్‌ను వాయిదా వేశారు. పాత సభ్యుల పదవీకాలం ఉండగానే.. కొత్త సభ్యులు, నూతన చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకొనేందుకు ప్రభుత్వం చట్ట సవరణచేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఓట్ల లెక్కింపు కోసం 123 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో 978 కౌంటింగ్ హాళ్లు ఉంటాయి. మొత్తం 536 స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్‌బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లను లెక్కించనున్నారు. మొదటిదశలో పోలింగ్ కేంద్రాలవారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలవారీగా విడదీసి ఒక్కోబండిల్‌లో 25 బ్యాలెట్ పత్రాలు చుట్టనున్నారు. రెండోదశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారు.
ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు ఏజెంట్లను నియమించుకోవాలని ఇప్పటికే అధికారులు అభ్యర్థులకు సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను తెరిచి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూడనున్నారు. చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేలో వేయనుండగా…సందేహం వస్తే రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి నిర్ణయం తీసుకుంటారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఈసీ మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. తొలుత ఎంపీటీసీ స్థానా ల్లో, తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పా ట్లు చేశారు. ఒక రౌండ్‌లో వెయ్యిఓట్లు లెక్కించనుండగా..ఒక్కోస్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటుచేశారు. 11,882 మంది సూపర్‌వైజర్లు, 23,647 మంది అసిస్టెంట్లతో కలుపుకొని మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు సందర్భంగా భారీ భ ద్రత ఏర్పాటు చేయనున్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు.