telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అక్కినేని శత జయంతి ప్రారంభం

ఈరోజు మహానటుడు అక్కినేని నాగేశ్వర రావు గారి శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి . తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర రావు గారిది స్ఫూర్తిదాయకమైన చరిత్ర.
1924 సెప్టెంబర్ 20న గుడివాడ తాలూకా వెంకట రాఘవాపురంలో అక్కినేని వెంకటరత్నం , శ్రీమతి పున్నమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు .
నాల్గవ తరగతి వరకు చదివిన అక్కినేని ఆ తరువాత ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదవలేకపొయ్యారు. చిన్నప్పటి నుంచే రంగస్థలంపై నటించడం మొదలు పెట్టారు . ఆరోజుల్లో స్త్రీ పాత్రలు ధరించడానికి మహిళలు ముందుకు వచ్చేవారు కాదు . పున్నమ్మకు ఆడ పిల్లలు లేకపోవడంతో అక్కినేనికి జడవేసి , పూలు పెట్టి అమ్మాయిలా చూసుకునేవారు . అదే సమయంలో “కనకతార” అనే నాటకంలో తార పాత్ర కు అవకాశం వచ్చింది . తల్లి పున్నమ్మ, పెద్ద అన్నయ్య రామ బ్రహ్మం ప్రోత్సహించారు .
1941లో పి .పుల్లయ్య దర్శకత్వం వహించిన “ధర్మ పత్ని” చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించడానికి అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్ కోల్హాపూర్ లో జరిగింది . అన్న రామబ్రహ్మం స్వయంగా తమ్ముడును వెంటబెట్టుకొని వెళ్ళాడు .
ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో స్వగ్రామం వచ్చి నాటకాలు వేయడం మొదలు పెట్టాడు . తెనాలిలో నాటకం వేసి తిరిగి వస్తున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో ఘంటసాల బలరామయ్య దృష్టిలో పడ్డాడు . అదే అక్కినేని జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది .

1944 మే 8వ తేదీన మద్రాస్ లో అడుగుపెట్టాడు . బలరామయ్య రూపొందించిన “శ్రీ సీతారామ జననం ” సినిమాలో అక్కినేని శ్రీరాముడు పాత్రలో నటించాడు . ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
ఎన్నెనో చిరస్మరణీయమైన పాత్రలు , సన్మానాలు , సత్కారాలు , పద్మశ్రీ , పద్మభూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే , పద్మా విభూషణ్ అక్కినేని వరించాయి. తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో 255 చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించారు . ఆయన నటించిన చివరి చిత్రం “మనం “. 2014 జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు గారు భౌతికంగా మనకు దూరమయ్యారు .

Related posts