ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సాధకబాధకాలను విన్న కేసీఆర్.. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. జనవరిలోనే పీఆర్సీతోపాటు పదవీ విరమణ వయసుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జనవరి నెలలోపు అన్ని రకాల ప్రమోషన్లు పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తీసుకొస్తామని పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ నేడు (గురువారం) సీఎస్‌కు ఇవ్వనుందని, కమిషన్ నివేదికపై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని సీఎం చెప్పారు.త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
సీఎంతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మైన్ మామిళ్ల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.’సీఎంతో ఉద్యోగులందరం భేటీ అయ్యాము. క్యాలెండర్, డైరీ సీఎం ఆవిష్కరించారు. పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇవాళ సీఎస్‌కు నివేదిక ఇవ్వనుంది. ఏపీలో పనిచేస్తున్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. జనవరిలో వేతన సవరణ సంఘాల ఫలాలు ఆదుకుంటామని ఆశిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగ ఖాళీలు మొత్తం నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పాము. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెల్త్ కార్డుల పైనా క్లారిటీ ఇవ్వాలని కోరాము’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలను జగన్ దెబ్బతీశారు: యనమల