telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి…?

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కసరత్తు ప్రారంభం అవుతోంది. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్ధిగా పనబాక లక్ష్మీ పేరు ఖరారు చేసింది. అటు బీజేపీ-జన సేన కూడా సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కూడా అభ్యర్ధిని ఖరారు చేసే పనిలో పడింది. రెండు నెలల క్రితం వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాత్మరణం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బల్లి దుర్గాప్రసాద్ స్థానం ఆయన సతీమణిని బరిలో నిలబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుమారుడు పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరిని బరిలో నిలబెట్టాలనే అంశంపై తర్జన భర్జలు కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే శాసనసభ్యులు కాకాణి గోవర్ధన రెడ్డి.. మంత్రులు బాలినేని, బొత్స, అనీల్, కొడాలి నానితోపాటు అందుబాటులో ఉన్న ఇతర ముఖ్యనేతలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సమావేశం అయ్యారు. ఎవరిని అభ్యర్ధిగా పెట్టాలనే విషయంలో అందరి అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు, రాజకీయ  సమీకరణాలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని సీఎం తుది నిర్ణయం ప్రకటిస్తారు. నిర్ణయాధికారాన్ని నేతలందరూ ఏకగ్రీవంగా సీఎంకు అప్పగించినట్లు మంత్రులు వెల్లడించారు. అయితే, అభ్యర్ధి ప్రకటన ఎప్పుడు అనేదానిపై మంత్రులు క్లారిటీ ఇవ్వడంలేదు. చూడాలి మరి ఎవరు ఆ అభ్యర్ధి అనేది.

Related posts