telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ బాధ్యతా రాహిత్యం వల్లే..వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు : చంద్రబాబు

కరోనా వ్యాధి నియంత్రణ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఒకప్పుడు పేపర్లలో చూసి వెంటనే స్పందించిన సంఘటనలు నా జీవితంలో చాలానే ఉన్నాయని… కరోనాతో అగ్ర దేశాలే వణికిపోతున్నాయని పేర్కొన్నారు. కరోనాను అర్ధం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప.. దీనిని నివారించలేమని నేను మొదట్లో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సమాజాన్ని కాపాడేందుకు అనుక్షణం పని చేశాను… కరోనా రాకుండా నివారించడమే పరిష్కార మార్గమని చెప్పినా జగన్ రెడ్డి వినలేదన్నారు. కరోనా వైరస్ ఒకరిని నుంచి మరొకరకి వస్తుంది, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తే నన్ను అవహేళనగా మాట్లాడారని… అనేక రంగాల నిపుణులు, మేథావులతో మాట్లాడానని తెలిపారు.

 

”పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా రాదని ముఖ్యమంత్రి చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించమని పదే పదే చెబితే పట్టించుకోలేదు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కేసులు బనాయించారు. చాలా దేశాలు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. మన ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోలేదు. 16.50 లక్షల మంది పది, ఇంటర్ పరీక్షల విషయంలో విద్యార్ధులను భయబ్రాంతులకు గురి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మీరెందురు నిర్వహిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే తప్పుడు లెక్కలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఒక వేళ ఒక్క విద్యార్ధి చనిపోతే రూ. కోటి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే ముఖ్యమంత్రి తోక ముడిచి అప్పుడు పరీక్షలు రద్దు చేశారు.” అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.

కరోనా బాధితులను ఆదుకోవాలని టీడీపీ దీక్ష పెడితే దానిని పక్క దారి పట్టించేందుకు దిశ చట్టం అంటున్నారని… మహిళలకు అన్యాయం జరిగితే 24 గంటల్లో పరిష్కరిస్తానని జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని మండిపడ్డారు. కొత్త చట్టాలు కాదు కావాల్సింది.. ముఖ్యమంత్రికి సత్తా ఉంటే ఉన్న చట్టాలు సరిపోతాయి. 14 ఏళ్ల నా పాలనలో తప్పు చేసిన వారికి తరువాత రోజే ఏం చేశామో మీరే చూశారు. పరిపాలన సత్తా ఉంటే, పద్ధతి ప్రకారం పాలన చేస్తే.. చట్టానికి బద్దులై ఉంటారు. దిశ చట్టం తిరుగుటపాలో మళ్లీ వచ్చింది. చట్టం లేదు కాని పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చారు. చట్టం లేదు.. మళ్లీ వెహికల్స్ తీసుకువచ్చారు. చట్టం లేదు.. ఇప్పుడు యాప్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కన, డీజీపి ఆఫీస్ కు కూత వేటు దూరంలో మహిళను అత్యాచారం చేస్తే దోషులను ఇంత వరకు పట్టుకోలేదు. జగన్ రెడ్డి పత్రిక సాక్షికి లాభాలు కావాలని ప్రతి రోజు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. హోల్ సేల్ గా అవినీతి చేసి డబ్బులు చేయాలన్న యావ తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస జగన్ రెడ్డిలో లేదు. కరోనా బాధితులకు ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని కావాలో జగన్ రెడ్డి ఎప్పుడైనా ఆలోచించారా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు.

”కరోనా వ్యాధితో కొంత మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నారు. భార్య, భర్త ఇద్దరు చనిపోతే పిల్లలు చూడలేని పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ లోని ముఖ్యమంత్రికి కనికరం లేదా? మనస్సు మారలేదా? నా కొడుకును కాపాడండి మందుల లేవు, ఎక్కడ చూసి బ్లాక్ లో మందులు అమ్ముతున్నారని ఒక తల్లి వేడుకున్నా ముఖ్యమంత్రికి మనస్సు లేదు. ప్రభుత్వానికి అధికారం, వనరులు ఉన్నాయి. అవసరమైతే రెగ్యులైజేషన్ చేసే సామర్ధ్యం ప్రభుత్వానికి ఉంటుంది. కాని ప్రభుత్వం పట్టించుకోలేదు. అహ్మదాబాద్ లో ఐఐటీ ప్రొఫెసర్ లెక్కల ప్రకారం.. మే నెలలో 2,932 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పడం అవాస్తవమన్నారు. మే లో చనిపోయిన లక్షా 27వేల మందిలో కోవిడ్ తో చనిపోయిన వారు ఎంత మంది ఉన్నారు? ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ తో చనిపోయిన వారు 12,500 మంది. వారి పేర్లను బయటపెట్టాలి.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘ముఖ్యమంత్రి మామ కోవిడ్ తో చనిపోయినా పట్టించుకోలేదు. మొదటి వేవ్ లో కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టడంతో మద్యం షాపులు ఓపెన్ చేశారు. చదువు చెప్పే టీచర్లను బ్రాందీ షాపుల క్యూ దగ్గర పెట్టారు. చాలా మంది టీచర్లు బాధపడ్డారు. మందు తాగవద్దని పిల్లలకు చెప్పే మేము మందు షాపుల దగ్గర ఉండటం వారిని కలిచివేసింది. రెండో వేవ్ భయంకరంగా తయారయ్యింది. ఏ విధంగా మందులు వాడాలో చెప్పలేని పరిస్థితి. తిరుపతి రియా ఆసుపత్రిల్లో 30 మందికి పైగా ఆక్సిజన్ అందక చనిపోయారు. పక్కనే ఉన్న చెన్నై నుంచి ఆక్సిజన్ తెప్పించలేకపోవడాన్ని ఎలా చూడాలి? ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక సామాన్య మహిళా చెబితే ఆమెను అన్యాయంగా అరెస్టు చేస్తారా? అన్యాయంపై పోరాడే వ్యక్తులపై కేసులు పెట్టినప్పుడే పోలీసులపై నమ్మకం పోయింది. సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయాయి. ఒక వ్యక్తి ఆయుర్వేద మందును కనిపెడితే ఎమ్మెల్యే వచ్చి ప్రారంభిస్తామంటారు, సాయంత్రానికి కలెక్టర్ వద్దని చెబుతారు. మరుసటి రోజు అదే ఎమ్మెల్యే మందు పంచి పెడతారు.

ప్రశ్నించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు. కోవిడ్ తో చనిపోతే అంత్యక్రియలు చేసే వారు కూడా లేరు. ఆ సమయంలో మృత దేహాలకు రేట్లు పెంచి బ్లాక్ మార్కెట్ లో డబ్బులు వసూలు చేశారు. ఎక్కడ చనిపోయినా మృత దేహాలను ఇంటికి తీసుకువెళ్లి, తరువాత శ్మశానంలో అంతిమ వీడ్కోలు ఇవ్వాలని టీడీపీ హయాంలో మహాప్రస్థానం కార్యక్రమం తీసుకువస్తే దానిని కూడా రద్దు చేశారు. కరోనా సోకిందని డెడ్ బాడీ ని నడి రోడ్డు మీద వదిలి పెడితే ఆ భార్య రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే.. ప్రభుత్వానికి పట్టదా? టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ఘోషిస్తే మీకు కనపడలేదా? ఒక బరియల్ గ్రౌండ్ లో 60 నుంచి 70 మంది చనిపోయిన వారిని దహనం చేశారని ఒక విలేఖరి చెబితే ప్రభుత్వం వినపడలేదా? కరోనాపై ఒక్క ప్రెస్ కాన్ఫిరెన్స్ ని ముఖ్యమంత్రి పెట్టాడా? నేను అండగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రజలకు భరోసా ఇవ్వరా? ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేర్లు ఉన్నాయా లేదా జగన్ రెడ్డి ఎప్పుడైనా చూసుకున్నారా. రెమిడిసివర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారు. వ్యాక్సిన్ విషయంలోనూ ముఖ్యమంత్రి రాజకీయం చేశారు. 

ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు వేసిన విత్తనమే భారత్ బయోటెక్. నేడు వారే వ్యాక్సిన్ తీసుకువస్తే దానికి కులం అంటగడతారా? ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా? నాడు నా పాలనలో తెలుగు వాడంటే అధిక ప్రాధాన్యతను ఇచ్చాను. నేడు ఫార్మా, ఐటీ కంపెనీలన్ని టీడీపీ హయాంలో వచ్చినవే. మెడ్ టెక్ పార్కును ముఖ్యమంత్రి చంపేశారు. రాష్ట్రానికి బాగా డ్యామేజ్ జరిగింది. రైతులు, రైతు కూలీలు తిండి లేకుండా అవస్థ పడ్డారు. రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు? కరోనా సమయంలో ప్రాణాలను తెగించి పండించిన పంటకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. టమోటాలు రోడ్డున పడేస్తున్నారు. మామిడి కాయలను కోస్తే ఖర్చు అవుతుందని చెట్లకే ఒదిలిపెట్టారు. గతంలో రైతులకు గిట్టుబాటు ధర అందించింది. రైతు బజారు ద్వారా తక్కువ ధరకు వినియోగదారుడికి అందించాం. దానిని కూడా నిర్వహించలేకపోయారు. రైతులు పండించిన పంటను ప్రత్యేక బస్సుల్లో తరలించాం.

ఏడాదిన్నర కరోనా సమయంలో అన్ని ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. డీజీల్, పెట్రోల్ ధరలు పెంచారు. ఆర్టీసీ, విద్యుత్ ధరలు పెంచారు, ఆస్తి పన్ను పెంచారు. ఆఖరికి చెత్త మీద కూడా పన్ను పెంచారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు పన్నుల భారం మరింత పెంచి గుదిబండలా మార్చారు. ఇసుక మాఫియాతో దోచుకుంటున్నారు. నేడు భవన నిర్మాణ కార్మికులు కుదేలయ్యారు. వారికి రూ.5వేలు ఇచ్చి ఆదుకోమంటే పట్టించుకోలేదు. ప్రైవేటు టీచర్ల పాట్లు ముఖ్యమంత్రికి కనపడటం లేదా? అమ్మా క్యాంటీన్లను తీసివెయ్యడం మంచి పద్దతి కాదని అమ్మా క్యాంటీన్లకు జయలలిత ఫోటో పెట్టి కంటిన్యూ చేశారు. కాని ఏపీలో మాత్రం రూ.5లకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారు? పేద వాడిపైన ఎందుకు ఇంత అసహనం? చంద్రన్న బీమా పథకంతో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించాం. బీమా ఇచ్చాం, మట్టి ఖర్చులకు రూ.5వేలు ఇచ్చాం. ఇప్పుడు దానిని రద్దు చేసి ఏమిచ్చారు? నేడు లక్ష మందికి పైగా చనిపోయారు.

అదే చంద్రన్న బీమా ఇప్పుడు ఉంటే రివైజ్ చేసిన తరువాత ఒక్కొక్కరికి రూ.10 లక్షలు వచ్చి ఉండేవి.
జాబ్ లెస్ క్యాలెండర్ తో యువత రెచ్చిపోయే స్థితికి వస్తే వాళ్లపైన కేసులు పెడతారా? న్యాయమైన కోర్కెలు అడిగిన విద్యార్ధులపై అత్యాచారం కేసులు పెడుతారా? చేతనైతే పేద ప్రజలకు న్యాయం చేసి ఆదుకోవాలి తప్పుడు కేసులు పెడితే ఖబర్దార్? మాట్లాడితే కేసులు, అరెస్టులు పెడుతున్నారు? పోలీస్ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఒక ఛాన్స్ అని రాష్ట్రాన్ని ముంచేశారు. బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించే వారు కాదు. నాపైన అక్రమ కేసులు పెడుతున్నారు. నాడు నేను అలా ఆలోచించి ఉంటే వైసీపీ పార్టీలో ఒక్కరైనా రోడ్డు మీదకు వచ్చేవారా? అతి తెలివి పని చేయదు. రెండేళ్లు అయ్యింది. మీ ప్రజా వ్యతిరేక విధానాలు చూశాం. అణచివేత దోరణి చూశాం. అవినీతి చూశాం. ప్రజలకు మజ్జిగ పోసి మీగడంతా ముఖ్యమంత్రి తినేస్తున్నారు. బ్రిటీష్ వాళ్ల కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి దోచేస్తున్నారు. ఇచ్చేది గోరంత, దోచేది కొండంత. రెండేళ్లల్లో ప్రతి ఒక్కరిపై రూ. 2.50 లక్షల భారం వేశారు. కాని ప్రజలకు ఏదో చేశామని డప్పలు కొట్టుకుంటున్నారు.

సాక్షి దగ్గర ఉండే డబ్బులు ఏ ఒక్క పత్రిక దగ్గర లేవు. పత్రికా ప్రకటలన్ని వారికే కేటాయిస్తున్నారు. జీవో నెం.2430 తీసుకువచ్చి పత్రికా రంగంపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ముఖ్యమంత్రి బ్లూ మీడియా కథేంటి? న్యాయంగా వార్తలు రాస్తే బ్లాక్ మెయిల్ చేస్తారా? పులివెందుల పంచాయితీ రాష్ట్రంలో జరగనీయ్యమని చెప్పాను. బాబాయ్ హత్య ఎవరు చేశారో తెలుసుకోవాలన్న బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఉంటే నిజాలు బయట పడతాయని భయపడుతున్నారు.
కరోనాపై ఆన్ లైన్ లో చాలా సెమినార్లు పెట్టాను. మేథావులు, ఫ్రంట్ లైన్ వర్కర్లతో చర్చలు పెట్టి ప్రజల్లో భరోసాను తీసుకువచ్చాను. టెలీ మెడిసిన్ ద్వారా చాలా మందికి ట్రీట్ మెంట్ అందించాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా మందికి సాయం అందించారు. కుప్పం, టెక్కలి, రేపల్లి, పాలకొల్లులో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం. ఆక్సిజన్ ప్లాంట్లు మీరు పెట్టరు. పెట్టే వాళ్లు ముందుకు వస్తే వాళ్లను పెట్టనివ్వరు. వినుకొండ లో ఆంజనేయలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు భోజనం పెడితే వాళ్ల మీద కేసులు పెట్టారు. 40 ఆక్సిజన్ కాన్సన్ ట్రేట్ లు, 1500 మంది కరోనా బాధితులకు అన్ని రకాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం అందించింది. ప్రభుత్వం కొన్ని పనులు చేయకపోయినా ప్రతిపక్ష నేతగా సాయం అందించాం. బాధితులను ఆదుకోవాలని అన్ని కార్యక్రమాలు చేశాం.

ఒక్క వ్యాక్సిన్ ముఖ్యమంత్రి కొన్నారా? ముఖ్యమంత్రి సహ నిందితుల వద్ద వ్యాక్సిన్ ఉన్నా ఎందుకు ఇవ్వలేదు. రెమిడిసివర్ జగన్ రెడ్డి సహనిందితులది కాదా? బంగారు గుడ్డు పెట్టే అమరావతిని సర్వనాశనం చేశారు. నాడు ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు వచ్చాయి. నేడు అక్కడ చదివిన విద్యార్ధులు ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీని అందుకుంటున్నారు. మన పిల్లలు బాగా చదువుకోవాలని అత్యున్నత విద్యాసంస్థను తీసుకువచ్చాను. కియా మోటర్లను తీసుకురావడంతో అక్కడ ప్రజలు అన్ని రకాలుగా లాభాలు పొందుతున్నారు. జగన్ రెడ్డి ఇక్కడ సంపాదించి విదేశాలకు పంపినవి వస్తున్నవి తప్ప.. రాష్ట్రానికి ఏ ఎఫ్ డీఐలు రాని పరిస్థితి. జగన్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం 23.2 శాతం వ్యాక్సిన్ వేశారు. కేరళ లో 30.3 శాతం, కర్ణాటక 28.2 శాతం, గుజరాత్ 29 శాతం వేశారు. ఒక రోజు కేంద్రం పంపిన 13 లక్షల వ్యాక్సిన్ లు అట్టిపెట్టి, ఒక్కసారిగా వేసి దేశమంతటా మేమే ఎక్కువ వ్యాక్సిన్లు వేశామని డప్పులు కొట్టుకుంటున్నారు. కేంద్రం దగ్గర నుంచి కొనుగోలు చేసి వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలు గొప్పగాని.. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ లను దాచిపెట్టి ఒక్కరోజు వేస్తే గొప్పతనం రాదు.

మహారాష్ట్ర రూ.5,470 కోట్లు, తమిళనాడు రూ.4,155 కోట్లు, కర్ణాటక రూ.1250 కోట్లు, కేరళ రూ.20 వేల కోట్లు కరోనా ప్యాకేజీ కింద ఇచ్చారు. మహారాష్ట్రలో ఉచిత భోజనం, భవన నిర్మాణ కార్మికులకు రూ.1200, చిన్న వ్యాపారులకు రూ.2,300, గిరిజనులకు రూ.2000, తమిళనాడులో రేషన్ కార్డు దారులకు రూ.4,000, నిత్యాసవర సరుకుల కింద రూ.2000, కర్ణాటకలో ప్రతి రైతుకు హెక్టార్ కు రూ.10,000, ఆటో క్యాబ్ డ్రైవర్ కు రూ.3,000, అసంఘటిత కార్మికులకు రూ.2000, వీధి వ్యాపారులకు రూ.2000, బియ్యం ఉచితంగా ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం ఆటో, ట్రాక్సీ డ్రైవర్లకు రూ.5000 ఇచ్చారు. 72 లక్షల కార్డుదారులకు ఉచితంగా రేషన్, సరుకులు అందించారు. కేరళలో కుటుంబానికి రూ.6000లతో పాటు 16 రకాల నిత్యావసర సరకులు అందించారు. హర్యానాలో రూ.5000 ఇచ్చారు. కాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమిచ్చారు?

జగన్ రెడ్డి ఏమిచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. రెండేళ్లల్లో చాలా కుటుంబాలు నష్టపోయాయి. కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు చనిపోయారు. కుటుంబాలకు కుటుంబాలు మనోధైర్యం కోల్పోతూ ఆర్ధికంగా కుంగిపోతున్నారు. వారి బాధ వర్ణనాతీతం. పడిన ఇబ్బందులు ఎవరూ తీర్చలేనివి. పూర్తిగి నిర్వీర్యం అయిపోయారు. ఎట్లా బతుకుతామో తెలియని పరిస్థతి. కొంత మంది తినే తిండి లేకుండా బాధపడుతున్నారు. కొనుగోలు శక్తి పూర్తిగా కోల్పోయారు. వస్తువలను తాకట్టు పెడుతున్నారు, భూములను అమ్ముకుంటున్నారు. ప్రజల తరపున పోరాడుతున్నాం. మీరు ఎంత నష్టపోయారో ఆలోచించండి. ఎందుకు ఇంత భారం ప్రజల మీద మోపాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి. పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఏ దేశంలో వ్యాక్సిన్ బాగా వేశారో ఆ దేశంలో కేసులు బాగా తగ్గాయి. ప్రతి కుటుంబం ముందు బతకాలి. అందుకే కుటుంబానికి రూ.10 వేలు అందించాలి. ప్రభుత్వం చేస్తున్న అవినీతిలో 10 శాతం తగ్గించుకుంటే రూ.10వేలు అందించవచ్చు.

ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా బాధపడుతున్నారు. అలాంటి వారికి రూ.7,500 ఇవ్వాలి. అభివృద్ధిని ట్రాక్ లో పెట్టాలి. ఉపాధిని కల్పిస్తే వారి పని వారు చేసుకుంటూపోతారు. బీమా ఉండి ఉంటే కరోనాతో చనిపోయిన వారు మళ్లీ కోలుకునే వారు. అందుకే కరోనాతో చనిపోయిన వారికి రూ.10 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆక్సిజన్ కొరతతో ప్రజలు చనిపోయారు అవి ప్రభుత్వ హత్యలే. అందుకే ఆయా కుటుంబాలకు తలో రూ.25 లక్షలు ఇవ్వాలి. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ తప్పు చేస్తే చనిపోయిన ప్రజలకు రూ. కోటి ఇచ్చారు. ఇప్పుడు మీ అసమర్ధతతో చనిపోయిన వారికి సాయం అందించాలి. రైతులు పండించిన పంటకు కొని డబ్బులు ఇవ్వలేదు. రైతులకు డబ్బులు చెల్లించాలి. కోవిడ్ వచ్చిన వారికి రూ.2000 ఇవ్వాలి. అంత్యక్రియాలకు రూ.5,000 అందించాలి. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్లు, నర్సర్లు, పోలీసులు, చనిపోతే రూ.50 లక్షల ఇస్తామని కేంద్రం డిక్లేర్ చేసింది.

ఇన్సురెన్స్ పెట్టారు. వెంటనే వారందరికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడాలని ఫ్రంట్ లైన్ వారియర్స్ పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా మీడియా ప్రతినిధులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తే ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు గుర్తించడం లేదు? ఒక ప్రతిపక్షంగా మా బాధ్యత మేం చేస్తున్నాం? ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్లకు రిప్రజంటేషన్లు అందించాం. రాష్ట్రంలో కరోనా బాధితులందరికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజా పక్షంగానే ఉంటాం. న్యాయం కోసం పోరాడాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చెప్పిన ఎన్టీఆర్ మాటలను తూచా తప్పకుండా పాటిస్తాం. జగన్ రెడ్డి నీతులు చెప్పి తప్పుడు పనులు చేస్తున్నారు. సమాజ హితం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాం. కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేసి మీ రుణం తీర్చుకుంటాం.

Related posts