telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగుజాతి ఉన్నంత కాలం.. టీడీపీ జీవించేవుంటుంది .. : చంద్రబాబు

chandrababu campaign in karnataka

తెలుగు వారు ఉన్నంత కాలం టీడీపీ జీవించేవుంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. టీడీపీ ఉండదని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదన్నారు. ఎటువంటి కష్టకాలాన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొని, నిలబడిన పార్టీ తమదేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మూడు రోజులపాటు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమీక్షా సమావేశాల ముగింపు సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థతవల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సందర్భంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి జరుగుతున్న డబ్బు పంపిణీ వ్యవహారానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యానికి నష్టం చేకూర్చే ఈ విధానంపై అందరూ చర్చించాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వాన్నంగా సాగుతోందని విరుచుకుపడ్డారు. 71 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై జగన్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.

అమరావతి నిర్మాణంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక విధానాన్ని జగన్ తన సొంత ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేయగా, బంగారు బాతును చంపేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మద్యం విధానం సైతం జగన్ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిందేనన్నారు. దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తున్నామని ప్రకటించి, రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలాచేశారన్నారు. మద్యం అమ్మకాలపై రెండు రకాల పన్నులు విధించి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ప్రభుత్వ ఆస్తులు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం అమలుచేయడం ద్వారా మాతృభాషను చంపేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. మృతృభాష పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తున్నా ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తూ, ముందుకు వెళుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts