వరల్డ్ కప్ విజేత, ఆసీస్ ఆటగాడు జేవియర్ డోహెర్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక కష్టాలు భరించలేక పొట్ట కూటి కోసం కార్పెంటర్‌గా మారాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన డోహెర్టీ 2001-02 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ అనంతరం ఆటకు గుడ్‌బై చెప్పాడు. మైకేల్ క్లార్క్ నేతృత్వంలో 2015 ప్రపంచకప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ జేవియర్ సభ్యుడు. ఆ మెగా టోర్నీలో ఏకైక మ్యాచ్ ఆడిన జేవియర్.. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ తీయకుండా 60 రన్స్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 34 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జేవియర్.. బతుకు తెరువు కోసం కార్పెంటర్ వృత్తిని ఎంచుకున్నాడు. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జేవియర్‌కు సాయం చేసేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ ముందుకొచ్చింది. కానీ దానికి అతను నిరాకరించాడు. తనకు ఎవరీ సాయం అక్కర్లేదని, కార్పెంటర్ పనిని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. తన పరిస్థితిని తెలుసుకొని ముందుకొచ్చిన ఆసీస్ క్రికెటర్ల సంఘానికి ధన్యవాదాలు తెలిపాడు. అతను మాట్లాడిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం ట్వీట్ చేసింది. డోహెర్టీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడి 55 వికెట్లు తీశాడు. చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడాడు.
previous post
కమిటీ నిర్ణయం ప్రకారం రాజధానిపై నిర్ణయం: మంత్రి కొడాలి