telugu navyamedia
వార్తలు సామాజిక

ఉత్తరానికో ఉత్తరం

letter

పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం

ఉభయకుశలోపరి!
సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు, సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం..
మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ.. రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు.. ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం.. ‘ఎక్కడున్నావ్’ అంటే అమీర్ పేటలో ఉన్నా ‘అంబర్ పేటలో ఉన్నా’ అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం.. ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం.. కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్..

ఉత్తరం రాస్తున్నప్పుడు హృదయావిష్కరణ జరిగేది.. ఫోన్ మాటల్లో ఆచితూచి అడ్డంగా అబద్ధాలాడేస్తున్నాం, లోపలొకటి పెట్టుకుని బయటకు ఇంకో మాట చెప్తున్నాం.. బొత్తిగా పాడైపోయాం.. ఒళ్ళంతా కుళ్ళుపోయి జబ్బుచేసున్నాం.. ఒక్కసారి మళ్ళీ మీ హవాతో మాకు ట్రీట్మెంట్ మొదలెట్టండి ఉత్తరం గారూ.. పుణ్యముంటుంది..

పోనీ పెరిగిన సో కాల్డ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అవకాశం ఉంది కదా, అందులోనే మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం లాంటి సందేశాలు పంపుకుందాం అనుకుంటే, అది కూడా ఇష్టానుసారంగా వాడేస్తున్నాం.. ఎవరో పంపిన మెసేజెస్ అటూఇటూ పంపేసి, అదేదో మా మేధావితనం అన్నట్టు గొప్పయిపోవడం,పిచ్చి
పిచ్చి ఇమేజ్లు,పనికి మాలిన వీడియోలు షేర్ చేసుకుంటూ ‘కిక్కిక్కిక్కికిక్కి’ అని నవ్వుకుంటూ పెద్ద మేధావుల్లా మెదళ్లను సానపట్టుకోవడం తప్ప ఏదీ ఎందుకూ పనికిరావట్లేదు..
మళ్ళోకసారి రండి ఉత్తరం గారూ ప్లీజ్

మీరు లేకపోవడం వల్ల..
ప్రేయసి మళ్ళీ మళ్ళీ చదువుకునే ముత్యాల పొగడ్తల ప్రేమలేఖ పత్తాలేకుండా పోయింది..
బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది..
భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది..
బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది..
ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది..

“అమ్మా.. అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది..
“ఏమేవ్.. అల్లుడు ఉత్తరం రాసాడు..అమ్మాయి నెల తప్పిందట” అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు..
ఇలాంటి ఎన్నో ఎన్నో భావాల బంధాలు మృగ్యమైపోయాయి..

‘గుండె గొంతులో కొట్లాడటం’
‘మనసు ఆర్తితో ద్రవించడం’
‘అక్షరాలు ఆనందంతో స్రవించడం’
మానేసాయి..
మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి..

మొత్తంగా మాటల్లో అక్షరాలున్నాయి కానీ, వాటికి ఎమోషన్ లేకుండా పోయింది.. చాలా కృత్రిమంగా, అసహజంగా ఉన్నాయిప్పుడు మానవ సంబంధాలు.. అందుకే ఉత్తరం గారూ.. మళ్ళీ రండి..

సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా పెరగడం అభివృద్ధి కావచ్చు.. దానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ మాయమైపోతున్న మానవ సంబంధాలు తిరిగి రావాలనే ఆకాంక్ష నాది..

ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను..

ఇట్లు..
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికి కోరుకునే చాదస్తపు మనిషి.

Related posts